హోం పేజి / భక్తి / చిన్న శ్లోకం – గొప్ప భావం!

చిన్న శ్లోకం – గొప్ప భావం!

వినాయకుని పూజ… ఆ మాటకి వస్తే ఏ పూజని మొదలుపెట్టినా ‘శుక్లాంబరధరం’ అన్న శ్లోకంతో మన ప్రార్థనలను ఆరంభిస్తాము. ఎటువంటి విఘ్నాలూ ఎదురుకాకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగాలనీ, ఏ ఆశయంతో అయితే ఆ పూజను నిర్వహించ తలపెట్టామో ఆ కార్యం నెరవేరాలని ఈ ప్రార్థన ద్వారా మనం దేవుని కోరుకుంటాము. మరి ఈ శ్లోకంలో నిక్షిప్తమై ఉన్న భావాన్ని ఒక్కసారి మననం చేసుకుందామా!

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే

శుక్లాంబరధరం – అంటే తెల్లటి వస్త్రాలను ధరించినవాడు అని అర్థం! తెలుపు పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిత్వంగా కలిగినవాడు అని చెప్పుకోవచ్చు. అంబరం అంటే ‘వస్త్రం’ అనీ ‘ఆకాశం’ అనీ రెండు అర్థాలు ఉన్నాయి. అంటే ఆకాశాన్నే ధరించినవాడు అన్న అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాపి అయిన ఈశ్వరుని తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం కదా!

విష్ణుం అంటే విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం. ఇక శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు అని భావం. వర్ణం అంటే కేవలం రంగు అని మాత్రమే కాదు. చంద్రుని రంగు, అతని ద్వారా ప్రతిఫలించే కాంతిలోనే ఉంది కదా! అంటే చంద్రునిలా వెలిగిపోతున్నవాడు అని అర్థం కావచ్చు. పైగా చంద్రుని ఇక్కడ శశి అన్నారు. పౌర్ణమినాటి చంద్రుని కాస్త దగ్గరగా చూస్తే అందులో కుందేలు ఆకారం కనిపిస్తుంది. ఆ కుందేలు ఆకారం పేరు మీదుగా చంద్రునికి శశి అన్న పేరు వచ్చింది. అంటే ఇక్కడ అలాంటి ఇలాంటి కాంతి కాదన్నమాట. నిండు పున్నమినాటి చంద్రుని కాంతి అని కవి భావం అయి ఉంటుంది. వర్చస్సు కలిగి ఉండటం గొప్ప జ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి చిహ్నంగా చెబుతారు. మరి ఆ గణేశునిలో అందులో లోటు లేదుగా!

చతుర్భుజం- దేవతలు మానవాతీతులు అనడానికి చిహ్నంగా వారిని అనేక భుజాలు, శిరసులతో పూజించడం తెలిసిందే! ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు కావచ్చు; తాను స్వయంగా అర్థం చేసుకుని వేదవ్యాసునికి రాసిపెట్టిన నాలుగు వేదాలు కావచ్చు; మనుషులను తరింపచేసే ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలు కావచ్చు.

ప్రసన్నవదనం ధ్యాయేత్‌- ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. భగవంతుడు మనకి తండ్రిలాంటి వాడైనా సరే! ఆయనలోని కోపాన్ని మనం భరించలేము. నరసింహావతారం ఎత్తిన విష్ణుమూర్తిని శాంతింపచేసేందుకు సాక్షాత్తూ దేవతలే వరుస కట్టారు. ఎంతైనా మనం మానవులం కదా! మన చిన్నచిన్న తప్పులను క్షమించి, మన కోరీకలను తీర్చే దైవాన్ని చూస్తే మనకి కొండంత బలం. అందుకనే ఎల్లవేళలా ఆయన మనపట్ల ప్రసన్నంగా ఉండాలని మనం కోరుకుంటాం. సర్వ విఘ్నోపశాంతయే- సమస్తమైన అడ్డంకులనూ తొలగించాలని కూడా అర్థిస్తున్నాను.

అదీ విషయం! ‘సర్వవ్యాపి, తెల్లని వస్త్రాలతో, చంద్రుని తేజస్సుతో, చతుర్భుజాలతో ఉన్న ఓ దైవమా! సమస్తమైన విఘ్నాలనూ తొలగించమని నీ శాంతిపూర్వకమైన వదనం ముందు శ్రద్ధగా వేడుకుంటున్నాను.’ అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఇందులోని తెల్లని వస్త్రాలు, విష్ణుం అన్న పదం, చతుర్భుజాలు అన్న వర్ణణ అన్నీ విష్ణు మూర్తికి సంబంధించినవనీ, కాబట్టి ఇది విష్ణుమూర్తిని ధ్యానించే శ్లోకమనీ కొందరి భావన. సరే! మనకి ఎవరైనా ఒకటే కాబట్టి ఆ చర్చను పండితులసకు వదిలివేసి హాయిగా శ్లోకాన్ని పదే పదే మననం చేసుకుందాము.

– నిర్జర.
Courtesy: http://teluguone.com/devotional/content/meaning-of-shuklam-bhartram-668-34046.html

One comment

  1. Hi, this is a comment.
    To delete a comment, just log in and view the post's comments. There you will have the option to edit or delete them.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *