హోం పేజి / భాగవతం

భాగవతం

భాగవతం హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాధ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.

ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను “స్కంధాలు” అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాధలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి.

భాగవతం ప్రాముఖ్యత

భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది.

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్

శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు. వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.

భాగవతం ప్రాముఖ్యతను గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్రాశాడు – అష్టాదశ మహాపురాణాలను ప్రస్తావించిన దేవీభాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉపపురాణంగా చెప్పబడింది. అప్పటిలో (దేవీభాగవతం 12వ శతాబ్దంలో రచింపబడిందని ఒక అభిప్రాయం) శాక్తేయమతానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో ఇలా వ్రాయబడి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది. లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. “ఈ మహా గ్రంథం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. .. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంథం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.”

భాగవత రచనా కాల నిర్ణయం

చారిత్రికంగా భాగవతం 9వ, 10వ శతాబ్దాల సమయంలో, భక్తి మార్గం ప్రబలమైన సమయంలో, రూపు దిద్దుకొన్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాని హిందూ మత సంప్రదాయాలలోని విశ్వాసం ప్రకారం కలియుగారంభంలో వేద వ్యాసునిచే రచింపబడినదని చెబుతారు.

కొందరి వాదనల ప్రకారం వేదాలలో సరస్వతీ నదిని ఒక మహానదిగా ప్రస్తావించినందున ఈ రచన చాలా పురాతనమైనది అయ్యుండాలి. ఎందుకంటే సరస్వతీ నది షుమారు క్రీస్తు పూర్వం 2000 సమయంలో కనుమరుగయ్యింది.

భాగవతం ప్రస్తుత పాఠం క్రీ.శ. 6వ శతాబ్ది కాలంలో రూపొంది ఉండాలని, అయితే మత్స్యపురాణంలో ఉన్న భాగవత ప్రశంసను బట్టి అంతకు పూర్వమే (క్రీ.శ. 4వ శతాబ్ది ముందే) ఒక మూలపాఠం ఉండి ఉండొచ్చునని ప్రొఫెసర్ హజరా భావించాడు. “ఫిలాసఫీ ఆఫ్ భాగవత” అనే విపుల పరిశోధన గ్రంథం ఉపోద్ఘాతంలో ప్రొఫెసర్ సిద్ధేశ్వర భట్టాచార్య ఇలా చెప్పాడు – “మొత్తం మీద శ్రీ మద్భాగవతానికి మూడు దశలలో మార్పులు, చేర్పులు జరిగాయని నిర్ణయించవచ్చును. మొదటి దశలో అతి ప్రాచీనమైన విషయ జాతకం మాత్రమే మాతృకాప్రాయమై సమకూడింది. క్రైస్తవ యుగారంభ కాలానికి రెండవ దశలో దీనికి మహాపురాణ లక్షణాలకు అనురూపమైన సంసిద్ధి లభించింది. ఇక చిట్టచివరి దశలో తముళదేశపు సాధుమండలి కృషి వలన నేటి రూపం సిద్ధించింది. ఈ దృక్కోణంనుండి పరిశీలిస్తే శ్రీమద్భాగవత ప్రకృత పాఠం ఆళ్వారులకు సమకాలంలో రూపొందినదని నమ్మవచ్చును.

భాగవతం అవతరణ

భాగవత పురాణము సంభాషణల రూపంలో రచించబడినది. పరీక్షన్మహారాజు ( పాండవ మధ్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి భోదించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు భోదించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు.